శుక్రవారం – శుక్రవారాభిషేకం, ఆకాశ గంగ తీర్థంతో అభిషేకం మరియు నిజ పాద దర్శనం
శుక్రవారాభిషేకం
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం. ప్రతి శుక్రవారం విశేషోత్సవంగా జరుపబడే ఈ అభిషేకం 614వ సంవత్సరానికి పూర్వం నుండే జరిగేదని తెలుస్తున్నది. విశేష సందర్భాల్లో జరిగే ఈ శుక్రవారాభిషేకాన్ని భగవద్రామానుజులవారు శ్రీస్వామి వారి వక్షఃస్థలంలో బంగారు అలమేలుమంగ ప్రతిమను అలంకరింపజేసిన శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం నాడు ఈ అభిషేకం జరిగేట్లు ఏర్పాటు చేశారట.
ఆకాశ గంగ తీర్థంతో అభిషేకం
పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంతో తరించిన మహాభక్తుడైన తిరుమలనంబి వంశీయుడు అందించిన కలశ తీర్థాన్ని తొలుత జియ్యంగారు స్వీకరించి భక్తి ప్రపత్తులతో బంగారు శంఖంతో అందించగా ఆ ఆకాశగంగ తీర్థాన్ని అర్చక స్వాములు శ్రీవారి శిరస్సుపై సమర్పిస్తూ హరిః ఓం సహస్రశీర్షా పురుషః అని పురుష సూక్తాన్ని ప్రారంభిస్తారు. కులశేఖరపడికి ఇవతల ఉన్న విద్వాంసులు పురుషసూక్తం అందుకుని అభిషేకం జరుగుతున్నంత సేపు పంచసూక్తాలను పఠిస్తూనే ఉంటారు. ఆకాశగంగాతీర్థంతో అభిషేకించబడుతున్న శ్రీవారి దివ్య మంగళమూర్తిని వీక్షిస్తున్న భక్తులు ఆ అభిషేకం తామే చేస్తున్నట్లుగా భావిస్తూ తన్మయులౌతారు.
పునుగు, కస్తూరి, జవ్వాది మున్నగు సుగంధెద్రవ్యాలతో, ఆకాశగంగా తీర్థంతో, సుమారు ఒక గంటపాటు అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత పసుపుతో శ్రీవారి వక్షఃస్థలం మీద ఉన్న మహాలక్ష్మికి కూడా ఈ అభిషేకం జరుగుతుంది.
ఎప్పుడో, ఏనాడో బ్రహ్మాది దేవతల కోరికమేరకు కలియుగ మానవుల కోసం వెలసిన శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షఃస్థల లక్ష్మితో కూడా ఈ శుక్రవారాభిషేక సమయంలో మాత్రమే దర్శించ వీలవుతుంది.
అభిషేకం అయిన తర్వాత శ్రీస్వామివారి మెడలో ఉన్న బంగారు అలమేలుమంగకు కూడా అభిషేకం జరుగుతుంది. ఆర్జితసేవగా జరుపబడుతున్న ఈ అభిషేకోత్సవం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూంది. అభిషేకానంతరం భక్తులందరి మీదా అభిషేక తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేకదర్శనం పూర్తవుతుంది.
నిజ పాద దర్శనం
ప్రతి శుక్రవారం అభిషేకానంతరం అభిషేక సేవలో పాల్గొన్న గృహస్థులు శ్రైస్వామి వారిని దర్శించి వెళ్లిన తర్వాత నిజ పాద దర్శనం ప్రారంభమవుతుంది.
ఆర్జిత రుసుమును చెల్లించిన భక్తులు ఈ సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి నిజపాదాలను అంటే (ఎలాంటి తొడుగులు లేకుండా) దర్శించవచ్చు. ఈ దర్శనంలో మాత్రమే శ్రీవారి నిజపాదాలు దర్శించుటకు ఆవకాశముంటుంది. మిగిలిన వేళల్లో ఆ పాదాలు బంగారు తొడుగులతో విరాజిల్లుతూ ఉంటాయి.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
ఈ ఉత్సవాలలో కొన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఆనంద నిలయంలో నిర్వహించే ఆయా వారాల సేవలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సాంప్రదాయరీత్యా సాధ్యం కాదు. అందుచేత ఈ సేవలను శ్రీవారి నమూనా ఆలయంలో చిత్రీకరించి ప్రసారం చేస్తూంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. భక్తులు వీక్షించగలరు.
Leave A Comment